పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
'తోపుదుర్తి’కి 320 కోట్లు దోచిపెట్టిన గత సర్కారు
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 19 :కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు పక్కా గృహాల నిర్మాణానికి ఇచ్చిన నిధులను అప్పట్లో వైసీపీ నేతలు దోచేశారు. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడికి చెందిన ’రాక్రీట్’ నిర్మాణ సంస్థ చేసిన పనుల కన్నా, నిధులు ఎక్కువ తీసుకుంది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైనదాని కంటే కూడా ఎక్కువగా ‘భారతీ’ సిమెంటు కొనుగోలు చేసి జగన్ సతీమణికి అప్పట్లో దోపిడీలో వాటా ఇచ్చింది. ‘పెద్ద మేస్త్రీ’ కట్టుబడి పేరిట దందా సాగింది.రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పక్కా ఇళ్ల నిర్మాణంలో జరిగిన భారీ దోపిడీ పర్వం వెలుగులోకి వచ్చింది. ప్రతి పేదోడికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగనన్న కాలనీల పేరుతో సెంటు స్థలం ఇచ్చేందుకు భూ సేకరణలో భారీ దోపిడీకి తెరతీసింది. రైతులకు, భూ యజమానులకు ఇచ్చింది తక్కువ.. వైసీపీ నేతలకు దోచి పెట్టిందే ఎక్కువ. నిజానికి, పేదల ఇళ్ల కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద 1.50 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులు చాలక పోవడంతో ఉపాధి నిధుల నుంచి మరో 30 వేలు చేర్చి పేదోడి ఇంటి నిర్మాణానికి 1.80 లక్షలు ఇచ్చింది. ఇళ్ల నిర్మాణానికి జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా తమ ప్రభుత్వమే లక్షలాది ఇళ్లు నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకుంది. ఇరదులోనూ సొమ్ములు కొట్టేసేందుకు ఎత్తుగడ వేసిన వైసీపీ నేతలు, అరకొర నిర్మాణాలు చేపట్టి అడ్డగోలుగా దోచేశారు.పేదల ఇళ్ల నిర్మాణం బాధ్యత రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ తీసుకోవాలి. అయితే ఇంటి నిర్మాణంలో లబ్ధిదారుడికి మూడు రకాల ఆప్షన్లు ఇచ్చిన గత వైసీపీ ప్రభుత్వం....ఎక్కువగా నిర్మించి ఇచ్చేందుకే మొగ్గు చూపింది. వాటిని మేస్ర్తీని పెట్టించి స్వయంగా కట్టిస్తానని ప్రకటించింది. ఎందుకంటే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడికి చెందిన రాక్రీట్ ఇన్‌ఫ్రాకు భారీగా దోచిపెట్టడానికి! ఎలాంటి టెండర్ లేకుండా రూ.950.63కోట్ల విలువైన పనులను రాక్రీట్‌కు అడ్డగోలుగా అప్పగించింది. రికార్డుల్లో మాత్రం ‘పెద్ద మేస్ర్తీ’తో పనులు చేయించినట్టు రాసుకున్నారు. ఏడు ఉమ్మడి జిల్లాల్లోని 35 లేఅవుట్లలో 51,633పక్కా గృహాల నిర్మాణాన్ని రాక్రీట్‌కు అప్పగించింది. అందులో 51,256 ఇళ్లకు పునాదులు వేశామని, కొంత మొత్తం విడుదల చేస్తే శ్లాబు వరకూ పూర్తి చేస్తామని రాక్రీట్....గృహ నిర్మాణశాఖకు ఇండెంట్ పెట్టింది. దీంతో మొదటి విడతగా 325 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ సొమ్మును అప్పటి వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. అందులో ఎక్కువ మొత్తం సిమెంట్ కొనుగోలు పేరిట ‘భారతీ’ సిమెంటుకే పోయిందని సమాచారం. ఇసుకకు కూడా మార్కెట్ ధర కన్నా ఎక్కువగా బిల్లులను రాక్రీట్ చూపించింది. ఇనుము అదే విధంగా కొనుగోలు చేసింది. కానీ ఇళ్ల నిర్మాణాన్ని మాత్రం అసంపూర్తిగా వదిలేసింది.రాష్ట్రంలో ఎన్నికల తర్వాత భారీ విజయం సొంతం చేసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలు తేల్చాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఆదేశించింది. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు రాక్రీట్ ఇన్‌ఫ్రాకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర నిధులు.. కొనుగోలు చేసిన భారతీ సిమెంటు.. జగనన్న దోపిడీ ఇసుక.. ఇతర మెటీరియల్ లెక్క తేల్చాలని చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పేదల ఇళ్ల నిర్మాణంలో ఎక్కడెక్కడ లోపాలున్నాయి..? అక్రమాలు ఏ మేరకు జరిగాయి.? పేదల ఇంటికి రాక్రీట్ ఎలా కన్నం వేసింది.? కేంద్ర ప్రభుత్వ నిధులు వైసీపీ నేతలు ఏ విధంగా కాజేశారు.? తదితర అంశాలపై విజిలెన్స్ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టింది. మొత్తం 35 కాలనీలకు వెళ్లి ఎన్ని ఇళ్లు పూర్తి అయ్యాయి.. మొండి గోడలతో ఆగినవి ఎన్ని.. పునాదిలోనే అసంపూర్తిగా మిగిలి పోయినవి ఎన్ని.. వాటికి వాడిన మెటీరియల్ తదితర అంశాలపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది.
Comment List