జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే
ఐ ఎన్ బి టైమ్స్ అమరావతి, నవంబర్ 11: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖారరైంది. ఈ నెల 22 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవగా.. మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ బుధవారానికి (నవంబర్ 13)కు వాయిదా పడింది. సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఏసీ సమావేశాన్ని వైసీపీ బాయ్‌కాట్ చేసింది.బీఏసీలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఉంటుందని.. అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరగాలన్నారు. రేపు (మంగళవారం) బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ నిర్వహణ ఉంటుందన్నారు. ఎనిమిది బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని బీఏసీలో నిర్ణయించినట్లు అయ్యన్న వెల్లడించారు.ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యతన్నారు. 95లో తెల్లవారుజామున 4 గంటలకు ముందు రోజు రాత్రి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరై సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. చీఫ్ విప్, విప్‌లను రేపు ఖరారు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో సభలో చంద్రబాబు హుందాతనం చూశానని జనసేన పక్షనేత నాదెండ్ల మనోహర్ అన్నారు.కనీసం 15రోజులైనా అసెంబ్లీ సమావేశాలు జరగాలని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు బీఏసీ సమావేశంలో తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగంతో కట్టిన రుషికొండపై చర్చ జరగాలన్నారు. ఎమ్మెల్యేలంతా ఒక రోజు రుషికొండ పర్యటన చేపట్టాలని విష్ణుకుమార్ రాజు కోరారు.
Comment List