సమృద్ధిగా వర్షాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఎమ్మెల్యే జూలకంటి సంకల్పం నెరవేరుతుంది! ...సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారు..!
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 30 :శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిన సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పంచాంగ కర్త, వేద పండితులు సాగి వెంకటేశ్వర శర్మ ప్రవచించారు. శ్రీ విశ్వావసు నామ ఉగాది సందర్బంగా ఆదివారం మాచర్ల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన పంచాంగం శ్రవణంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పంచాంగ శ్రవణంలో ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ కర్త వెంకటేశ్వర శర్మ ప్రవచిస్తూ.. మన నియోజకవర్గానికి రాజు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కావున ఆయన జాతక రీత్యా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో నియోజకవర్గానికి అంతా మంచే జరుగుతుందని చెప్పారు. తాగు, సాగునీటి ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తారని, నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని వివరించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గానికి నిధులు వస్తాయని, ప్రజలకు ఎమ్మెల్యే చక్కని పాలన అందిస్తారని చెప్పారు. ఎర్ర పంటలు దండిగా పండుతాయని, రైతాంగమంతా పాడిపంటలతో సుభిక్షంగా ఉంటారని పేర్కొన్నారు. అనంతరంశ్రీ కోదండ రామాలయం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List